అది నిజమని రుజువు చేస్తే రాజీనామా చేస్తా: యెడ్యూరప్ప

SMTV Desk 2019-02-08 14:35:10  Yadyurappa, Kumaraswamy, Karnataka, Audio tape

కర్ణాటక, ఫిబ్రవరి 08: బీజేపి నేతలు కాంగ్రెస్ నేతలను డబ్బు ఆశ చూపి ప్రలోభాలకు గురి చేస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బెంగుళూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. దేనికి సంబంధించి ఒక ఆడియో టేపును కుమారస్వామి మీడియాకు వినిపించారు.

ఆ టేపులో జేడీఎస్ ఎమ్మెల్యే నాగనగౌడకు మధ్యవర్తుల ద్వారా బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు యెడ్యూరప్ప డబ్బులు ఎరవేస్తున్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో యెడ్యూరప్ప కుమార స్వామి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని ఆ ఆడియో టేపులో ఉన్నది నిజం కాదని, తన మిద కక్షతో కావాలనే ఆ ఆడియోను సృష్టించారని ఆయన అన్నారు.

ఎమ్మెల్యే నాగనగౌడను ప్రలోభానికి గురి చేసారనే ఆరోపణలను యెడ్యూరప్ప ఖండించారు. తను కేవలం ఆలయ దర్శనం కోసమే దేవదుర్గకు వెళ్లానని దర్శనం తర్వాత వెంటనే మళ్ళీ తిరిగి వచ్చేసామని అన్నారు. అంతేకానీ తను నాగనగౌడ కుమారుడు శరణ్ గౌడను కలవలేదని స్పష్టం చేసారు. తాను శరణ్ గౌడతో మాట్లాడినట్టు నకిలీ ఆడియో రికార్డు చేసారని ఆయన అన్నారు.

కుమారస్వామి తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ ఆడియో డ్రామాలు ఆడుతున్నారని యెడ్యూరప్ప విమర్శించారు. ఒకవేళ తనపై చేస్తున్న ఆరోపణలు నిజమని రుజువు చేస్తే తానే స్వయంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని యెడ్యూరప్ప సవాల్ చేసారు.