ఫెడ్‌కప్‌లో భారత్ శుభారంభం...

SMTV Desk 2019-02-08 13:20:11  Fed cup, India VS Thailand, Ankita raina, Tennis

కజకిస్థాన్‌, ఫిబ్రవరి 08: ఆస్థానా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఫెడ్‌కప్‌లో గురువారం జరిగిన పోరులో 2-1తో థాయిలాండ్‌పై భారత మహిళల జట్టు ఉత్కంఠ విజయం సాధించి శుభారంభం చేశారు. భారత నెంబర్ వన్ టెన్నిస్ సింగిల్స్ ప్లేయర్ అంకిత రైనా సింగిల్స్‌తోపాటు డబుల్స్‌లోనూ విజయం సాధించడంతో ఫెడ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ చేతిలో ఓడిపోయే ప్రమాదాన్ని తప్పించుకుంది. తొలి సింగిల్స్‌లో కర్మన్‌కౌర్ తాండి 2-6,6-3,3-6 స్కోరుతో థాయిలాండ్ అమ్మాయి నుదిండా లువాన్‌గ్నమ్ చేతిలో అనూహ్యంగా ఓడింది.

ఆ తర్వాత జరిగిన రెండో సింగిల్స్‌లో అంకిత 6-7 (3), 6-2, 6-4తో పియాంగ్‌టాన్‌ ప్లిపుచ్‌ (థాయిలాండ్‌)పై పోరాడి నెగ్గడంతో స్కోరు 1-1తో సమమైంది. తొలి సెట్‌ కోల్పోయినా కూడా తిరిగి పుంజుకొని ఆడిన ఆమె తర్వాతి రెండు సెట్‌లను గెల్చుకొని మ్యాచ్‌ సొంతం చేసుకుంది. దీంతో నిర్ణాయక డబుల్స్‌ మ్యాచ్‌ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో అంకిత-కర్మన్‌ జోడీ 6-4, 6-7 (6), 7-5తో పియాంగ్‌టాన్‌-నుడిండా జోడీపై పోరాడి గెలిచింది. తదుపరి మ్యాచ్‌లో నేడు ఆతిథ్య జట్టు కజకిస్థాన్‌తో భారత మహిళల జట్టు తలపడనుంది.