కోపంలో అక్క కు నిప్పంటించిన తమ్ముడు

SMTV Desk 2019-02-08 12:55:06  Fire Accident, Ananthapuram, Baba Fakruddin, Sister-Brother

అమరావతి, ఫిబ్రవరి 08: ఇంట్లో సోదరితో గొడవపడ్డ ఓ మైనర్ బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. తీవ్ర ఆవేశంలో ఉన్న ఆ బాలుడు తన సోదరి పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దాడిలో ఘోరంగా గాయపడ్డ బాలిక ప్రస్తుతం కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.

ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రం మండలం పొడరాళ్ల గ్రామంలో బాబా ఫక్రుద్దీన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఆయనకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే మైనర్లు అయిన ఈ అక్క తమ్ముళ్ళు తరుచు గొడవపడుతు ఉండేవారు. ఆ క్రమంలోనే ఈరోజు కూడా వీరిద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది.

దీంతో చుట్టపక్కల వారు వీరిని సముదాయించి పంపారు. ఇంట్లో మరోసారి గొడవ జరగడంతో ఓపిక నశించిన తమ్ముడు అక్కపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆ మంటల వేడి తట్టుకోలేక బాధితురాలు అరవడంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు వెంటనే అక్కడకు చేరుకొని మంటలను ఆర్పి బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశారు. బాధితురాలికి 50 శాతం కాలిన గాయాలు అయ్యాయనీ, ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.